Trending

పోట్లపల్లి ఊరి శివాలయాలు, 101 దేవాలయాల సమగ్ర కథనం

potlapally temple

potlapally temple

చరిత్ర దాచేస్తే దాగేది కాదు. కొత్త కొత్త విషయాలను ఎప్పుడూ వెలికితీస్తూనే ఉంటుంది. అది ఒక్కోసారి కాలానికి కూడా సవాల్ విసురుతూ ఉంటుంది. హుస్నాబాద్ ప్రాంతానికి వేల ఏళ్ల చరిత్ర ఉంది అనేది సుస్పష్టం. పాత రాతి యుగం నుంచి మొదలు కొంటే కొత్త రాతి యుగం వరకు ఆదిమానవుడి అవశేషాలు ఎన్నో ఇక్కడ లభ్యమయ్యాయి. పురావస్తు శాఖకు చెందిన వారు ఎన్నో కొత్త కొత్త అంశాలను కనుగొన్నారు. పొట్లపల్లి… ఇది నిరంతరం ఏదో ఒక విశేషాన్ని తెరపైకి తెస్తూనే ఉంటుంది. ఈ ఊరిలో అనేక దేవాలయాలు కొలువై ఉండేవి అనడానికి ఎన్నో ఆధారాలు లభించాయి.

 

ఊరి చుట్టూ కూడా అనేక సాక్ష్యాలు, ఋజువులు ఎన్నోసార్లు వెలికి వచ్చాయి. నాలుగు దశాబ్దాలుగా ఏదో వింత బయట పడుతూనే ఉంది. అక్కడ ఇల్లు కట్టుకోవడానికి ఎవరు తవ్వకాలు జరిపిన ఏదో ఒక కొత్త విషయం బయటకు వస్తూనే ఉంటుంది. 1996 సెప్టెంబర్ నెలలో ఇక్కడ ఒక అతి పెద్ద భారీ శివలింగం వెలుగుచూసింది. కాకతీయుల కాలానికి చెందిన ఆ శివలింగం నిగనిగలాడే నల్లని గ్రానైట్ రాయితో నిన్ననో మొన్ననో చెక్కినట్లు గా ఉండడం చూపరులను ఆశ్చర్యానికి గురి చేసింది. వెంటనే దానికి పూజాపునస్కారాలు చేశారు. వందల ఏళ్లు భూమిలో ఉన్న కారణంగా శివుడు రౌద్రంగా ఉంటాడని భావించి స్థానికంగా ఉన్న మల్లికార్జున దేవాలయంలో ఆ శివలింగాన్ని జల ప్రతిష్ఠ చేశారు.

SHIVARATRI LIVE :: Husnabad Mandal Potlapally Shivalayam LIVE ...

అనంతరం రేణుకా నది తీరాన (ఎల్లమ్మ వాగు) అందమైన దేవాలయాన్ని నిర్మించి ఆ శివలింగాన్ని అందులో ప్రతిష్ఠించారు. అది అప్పటి నుంచి నేటి వరకు అశేష జనవాహినితో పూజలందుకుంటోంది. ఇప్పుడు మళ్లీ రెండు రోజుల క్రితం అక్కడ మరో శివలింగం పానవట్టం వెలుగుచూసింది. రాయి లక్షణాన్ని గమనిస్తే ఇది కాకతీయుల కంటే ముందటిది అనిపిస్తోంది. బహుశా రాష్ట్ర కూటుల కాలంలోనో…శాతవాహనుల కాలంలోనో దీనిని ప్రతిష్ఠించి ఉంటారు. ఈ ఊరిలో నూట ఒక్క దేవాలయాలు ఉండేవి అనడానికి మరో రుజువు దొరికినట్లయింది. ఇక్కడ చారిత్రక విశేషాలే కాదు, పౌరాణిక విశేషాలు కూడా ఉన్నాయి. మామూలుగా అయితే కాకతీయుల కంటే ముందు రాష్ట్రకూటులు శాతవాహనుల కాలంలో పొట్లపల్లి ప్రాంతము ఒక వెలుగు వెలిగింది అని చరిత్రకారుల అభిప్రాయం. అంతకు ముందు నుంచీ ఈ ప్రాంతానికి ఒక గుర్తింపు ఉందనే అభిప్రాయం ఉంది.

హరిశ్చంద్ర మహారాజు వంశానికి చెందిన పరీక్షిత్తు, ఆయన కుమారుడు జనమేజయుడు కూడా ఈ ప్రాంతానికి రాజులు గా ఉండేవారనేది కొందరు చరిత్రకారులు చెబుతున్నారు. సర్పయాగము ఇక్కడే జరిగిందని కూడా ఆధారాలున్నాయంటున్నారు. పొట్లపల్లి గ్రామంలో చాలా చోట్ల సర్పాల విగ్రహాలు లభించడమే అందుకు తార్కాణం. కార్త్యవీర్యార్జునుడి సహస్ర చేతులను రేణుకాదేవి ఖండించింది కూడా ఇక్కడే ఈ అని ఒక అభిప్రాయం ఉంది. అందుకే దీనికి ఎల్లమ్మ వాగు అనే పేరు వచ్చిందంటారు. ఇలా పొట్లపల్లి చారిత్రక, పౌరాణిక అవశేషాలతో కూడిన ఒక కొత్త అధ్యాయాన్ని ఎప్పటికప్పుడు లిఖిస్తూనే ఉంది. పురావస్తు శాఖ అధికారుల నిర్లక్ష్యం లేదా పాలకులు పట్టించుకోకపోవడం అనండి…

Also Read : బుచ్చవ్వ నీ దాతృత్వం వెలకట్టలేనిది. బట్టలు ఉతికి సంపాదించిన పైసలని పంచిపెట్టింది!

ఇక్కడ విశేషాలు ఎప్పటికప్పుడు వెలుగు చూడకుండా పోతున్నాయి. నిజంగా ఇక్కడ సీరియస్ గా తవ్వకాలు జరిపితే కొత్త కొత్త విశేషాలు ఎన్నో వెలుగుచూసే అవకాశం ఉంది. తెలంగాణ ప్రాంతంలో ఒకే ఒకే చోట అనేక రకాల విగ్రహాలు లభించడం అనేది ఒక పొట్లపల్లి లోనే చూస్తూ ఉన్నాం. ఈ ప్రాంతాన్ని ద్రావిడులు, నాగులు కూడా పరిపాలించే ఉంటారనేది చరిత్రకారుల అభిప్రాయంగా ఉంది. ఇవన్నీ నిగ్గు తేలాలంటే ఇక్కడ తవ్వకాలు జరిపి పొట్లపల్లి సమగ్ర చరిత్రను వెలికి తీయాల్సిన అవసరం ఉంది. అలా తీస్తే ఇది ఒక గొప్ప పర్యాటక స్థలంగా మారిపోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

Credit : Mohd Fazul Rahaman

Comments are Closed

Theme by Anders Norén