తెలంగాణ హీరోను మరిచిన సినీలోకం ! ఎంత సిగ్గుచేటు…

తాడేపల్లి లక్ష్మీ కాంతారావు

తెలుగు సినీ పరిశ్రమకు నందమూరి తారకరామారావు, అక్కినేని నాగేశ్వరరావు రెండుకళ్ళైతే ,ఆ రెండు కళ్ళ మధ్య తిలకం  తాడేపల్లి లక్ష్మీ కాంతారావు.. ఉరఫ్ కత్తి కాంతారావుగారు. ఒకప్పుడు NTR, ANR లతో సమానంగా పారితోషికం తీసుకున్న తెలంగాణ హీరో ఆయన. జానపద హీరోగా మంచిపేరు సంపాదించుకున్నాడు. జానపద సినిమాలు మాత్రమే కాకుండా పౌరాణిక చిత్రాల్లో కూడా నటించాడు కాంతారావు.. కృష్ణుడు, రాముడు అంటే టక్కున మనకి ఎన్టీఆర్ ఎలా గుర్తుకు వస్తారో నారదుడు అంటే కాంతారావు అలా గుర్తుకు వచ్చేవారు. ఆయన కాల్షీట్లకోసం నెలల తరబడి ఎదురు చూసేవారట నిర్మాతలు.!

1923 నవంబరు 16 న తెలంగాణ లోని కోదాడ దగ్గర గుడిబండ అనే గ్రామంలో ఉన్నత కుటుంబంలో జన్మించిన కాంతారావు 1952 లో నిర్ధోషి అనే సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యారు. పౌరాణిక, జానపద,సాంఘిక సినిమాలలో తనదైన ముద్రవేసారు. కాంతారావు- రాజనాల హీరో, విలన్ లగా నటిస్తే ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. సినిమాలలలో బాగా సంపాదించినా సినీ నిర్మాణరంగంలో ప్రవేశించి అంతా పోగొట్టుకున్నారు. సప్తస్వరాలు అనే సినిమా తీసి విడుదల చేయలేక వేరొకరికి అమ్మివేయగా అది సూపర్ హిట్ అయింది.

వయసు పై బడుతుంటే ఆయనకి సినిమా అవకాశాలు బాగా తగ్గాయి.. ఆర్ధికంగా చాలా ఇబ్బంది పడుతున్న రోజుల్లో ఆయన బుల్లితెరపై కూడా కనిపించారు.. ఎన్టీఆర్, ఏఎన్నాఆర్ లతో కలసి సమానంగా పారితోషికం తీసుకున్నప్పటికీ ఆయన ఆస్తులు మాత్రం కూడబెట్టలేకపోయారు.. ఆయన సంపాదించుకున్న అస్తిపాస్తులు ఏమైనా ఉన్నాయా అంటే అది కేవలం ప్రజాభిమానమే అని చెప్పాలి.. చివరి రోజుల్లో అత్యంతదయనీయమైన పరిస్థితులను ఎదురుకున్నారు కాంతారావు. కానీ సినిమా ఇండస్ట్రీ కూడా ఆయనని పట్టించుకున్న పాపాన పోలేదు..

ప్రాంతీయ విభేదాలకు కాంతరావు బలి అయ్యారనే చెప్పాలి.. 75 ఏళ్ల సినీ వజ్రోత్సవాల్లో కూడా ఆయనకి సరైనా గౌరవం దక్కలేదు. 2009 లో క్యాన్సర్ తో పోరాడుతూ యశోద హాస్పటల్ లో మరణించారు కాంతరావు. జీవితం ఎలా వుండి, ఎలా ముగిస్తుందో కాంతారావు జీవితమే ఉదాహరణ. తెలుగు సీనీచరిత్ర టి.యల్ కాంతారావుగారిది చెదరని జ్ఞాపకం. ఆ మహానటుడికి జన్మదినం సందర్భంగా నివాళులు చెబుతూ ఓసారి స్మరించుకుందాం…

Also read:  ఇప్పటి సినిమాల్లో ఆ క్రేజీ కాంబినేషన్స్ ఎక్కడ?

error: