మిషన్ భగీరథ పథకాలను ప్రశంసించిన కేంద్ర మంత్రి

mission bhagiratha

మిషన్ భగీరథ పథకం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ప్రతీ ఇంటికీ ప్రతీ రోజు సురక్షిత మంచినీరు అందించినట్లే, దేశ వ్యాప్తంగా మంచినీటి పథకం అమలు చేసే ఆలోచన ఉన్నదని కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ ప్రకటించారు. ప్రజలకు మంచినీటి సౌకర్యం కల్పించడం ప్రభుత్వాల కనీస కర్తవ్యమని ఆయన అన్నారు. ఆయా రాష్ట్రాల భాగస్వామ్యంతో మంచినీటి పథకాలు అమలు చేయాలని భావిస్తున్నట్లు వెల్లడించారు. మంచినీటి పథకాలు అమలు చేయడంతో పాటు, మురుగు నీటిని (సీవరేజ్) ట్రీట్ చేసి ఆ నీళ్లను వ్యవసాయ, గృహోపయోగానికి ఉపయోగించే విధానాలు అవలంభించాలని కేంద్ర మంత్రి సూచించారు.

ప్రగతి భవన్ లో సోమవారం ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు తో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ పథకం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, ఇతర అధికారులు మిషన్ భగీరథ స్వరూపాన్ని పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు.

‘‘తెలంగాణ రాష్ట్రంలో 24వేల ఆవాస ప్రాంతాలకు ప్రతీ రోజు ఉపరితల జలాలను మంచినీరుగా అందించేందుకు మిషన్ భగీరథ పథకం చేపట్టాం. తెలంగాణ రాష్ట్రంలో చాలా చోట్ల మంచినీటికి తీవ్రమైన ఎద్దడి ఉండేది. చాలా చోట్ల ఫ్లోరైడ్ సమస్య ఉండేది. అసలు తాగునీళ్లే దొరకకపోయేది. దొరికిన నీళ్ళు కూడా శుభ్రంగా ఉండకపోవడం వల్ల ప్రజలు అనారోగ్యం పాలయ్యేవారు. అందుకే గోదావరి, కృష్ణా జలాలను శుద్ధి చేసి ప్రతీ రోజు ప్రజలకు అందివ్వడానికి ఈ కార్యక్రమం తీసుకున్నాం. పథకం దాదాపు పూర్తయంది. తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించింది. ఈ పథకం ద్వారా ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు. మహిళలకు ఇబ్బందులు తప్పాయి. వారి జీవన పరిస్థితులు మెరుగయ్యాయి. రాబోయే 30 ఏళ్ల వరకు పెరిగే జనాభాను కూడా అంచనా వేసుకుని, అప్పటి అవసరాలు కూడ తీర్చే విధంగా ఈ ప్రాజెక్టుకు డిజైన్ చేశాము. ఇలాంటి పథకం దేశమంతా అమలయితే మంచిది. ప్రజలకు మంచినీరు అందించడానికి చేసే కార్యక్రమాలను ఆర్థిక కోణంలో చూడవద్దు’’ అని ముఖ్యమంత్రి వివరించారు.

‘‘దేశంలో ప్రజలందరికీ సురక్షిత మంచినీరు అందించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఈ లక్ష్యాన్ని సాధిస్తున్నది. కాబట్టి మిషన్ భగీరథ పథకానికి, దాని నిర్వహణకు ఆర్థిక సహకారం అందించండి’’ అని ముఖ్యమంత్రి కేంద్ర మంత్రికి వివరించారు.

Also Read : Biggboss : పేరు ఘనం… ఫలితం శూన్యం

11వ శతాబ్ధంలోనే కాకతీయలు వేలాది చెరువులు తవ్వించారని, సమైక్య పాలనలో అవన్నీ నాశనమయ్యాయని సిఎం చెప్పారు. మిషన్ కాకతీయ ద్వారా రాష్ట్రంలో జరిగిన చెరువుల పునరుద్ధరణ కార్యక్రమాన్ని కూడా ముఖ్యమంత్రి వివరించారు. 90 శాతం ఆయకట్టు కలిగిన చెరువులను బాగు చేయగలిగామని వెల్లడించారు.

మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలను ప్రశంసించిన కేంద్ర మంత్రి, తాను త్వరలోనే మరోసారి తెలంగాణలో పర్యటించి క్షేత్ర స్థాయిలో ఈ పథకాల అమలును స్వయంగా చూస్తానని చెప్పారు.

error: write your own !