కేసీఆర్ పిలిచినా సరే.. ఆర్టీసీ కార్మికులు డ్యూటీలో ఎందుకు చేరడం లేదు ?

KCR

తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె మొదలయ్యే నెల రోజులు అవుతోంది. 48 వేల మంది కార్మికులకు సెప్టెంబర్ వేతనాలు అందలేదు. అక్టోబర్ నెలలో డ్యూటీలకు వెళ్లలేదు. ఇలా రెండు నేలల వేతనాలు వదులుకొని మరీ పోరాడుతున్నారు. ఇప్పటికే 20 మందికిపైగా ఆర్టీసీ కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. అమరుల త్యాగాలతో సాధించుకున్న తెలంగాణలో కార్మిక సోదరుల బలవన్మరణాలు అందరినీ కలచివేస్తున్నాయి. కోర్టులో కేసు నడుస్తోంది. వాదోపవాదాలు కొనసాగుతున్నాయి. ఇది హైకోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకు వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. నవంబర్ 2న జరిగిన క్యాబినేట్ భేటీ అనంతరం.. ముఖ్యమంత్రి కేసీఆర్ .. కార్మికుల సోదరుల ఉద్యోగాలకు ఎలాంటి ఢోకా లేదు… నవంబర్ 5 లోపు విధుల్లో చేరండంటు డెడ్ లైన్ పెట్టారు. అదే సమయంలో… రాష్ట్రంలో 5,100 ప్రైవేటుబస్సులకు ఆర్టీసీ రూట్లలోనూ పర్మిట్లు ఇస్తున్నట్లు ప్రకటించారు. అంటే… దాదాపు సగం ఆర్టీసీ ప్రైవేటు చేతుల్లోకి వెళ్లినట్లు అవుతుంది. ఇది ఆర్టీసీ కార్మికుల భవిష్యత్తు.. సంస్థ మనుగడకే సవాల్ విసిరే నిర్ణయం.

అయినా… కార్మికులు సమస్యలు పరిష్కరించే వరకు విధుల్లో చేరేది లేదని తేల్చి చెబుతున్నారు. సీఎం ప్రకటనకు స్పందనగా కేవలం పదుల సంఖ్యలో కార్మికులు వచ్చి విధుల్లో చేరారు. డెడ్ లైన్ లోపు ఈ సంఖ్య వందల్లోకి, లేదా నామమాత్రపు వేలల్లోకి చేరవచ్చు. అయినా… మేజర్ కార్మికులు సమ్మెనే కొనసాగిస్తామంటున్నారు. అసలు కార్మికులు ఎందుకు ఇంత పట్టుపడుతున్నారు ? సెల్ఫ్ డిస్మస్ అన్న ప్రభుత్వమే… ఇప్పుడు గడువు లోపు వచ్చి చేరమన్నా ఎందుకు చేరడం లేదు ? ఉద్యోగాలను పనంగా పెట్టి మరీ ఎందుకు పోరాటానికే సై అంటున్నారు.. ? డిపోల్లో జరిగే విషయాలు, ఆర్టీసీ నిర్వహణ, కార్మికుల వెట్టి చాకిరీపై అవగాహన లేని చాలా మంది సీఎం చెప్పాడు కదా… వీళ్లకు ఏమైంది వెళ్లి చేరొచ్చు కదా అంటున్నారు. అసలు వీళ్లని యూనియన్ నాయకులే ముంచుతున్నారని ఆడిపోసుకుంటున్నారు. కానీ… వాళ్లకు తెలియంది ఏంటంటే…. ఆర్టీసీ కార్మికులు పేరుకే ప్రభుత్వ సంస్థ ఉద్యోగులైనా… వారి ప్రయాణం దిన దిన గండమే అని. ఆ సుడిగుండాల నుంచి కార్మికులను రక్షించేంది.. చేసిన పనికి సరైన ప్రతిఫలం అందేలా చూసేది కార్మిక యూనియన్లేని.

కార్మికులు – అధికారులు భిన్న ధృవాలు

ఆర్టీసీ ఈ రోజు ఈ స్థాయికి వచ్చిందంటే దానికి కారణం నూటికి నూరు పాళ్లు కార్మికులే. రేయింబవళ్ల వాళ్ల కష్టం ఫలితంగానే రోడ్డు రవాణా సంస్థ నేడు దాదాపు కోటి మందికి సేవలు అందించే స్థాయికి చేరింది. ఆర్టీసీ నిర్వహణలో డ్రైవర్లు, కండక్టర్లు, సూపర్ వైజర్లు, మెకానిక్ లు, శ్రామిక్ లే కీలకం. అధికారుల పాత్రలో ఉండే డిపో మేనజర్లు, అకౌంటెట్లది లెక్కల పాత్ర మాత్రమే. డొక్కు బస్సులు చేతికిచ్చి.. మైలేజ్ రావాలి, ఆదాయ టార్గెట్ రీచ్ కావాలి, సమయ పాలన ఉండాలి అనే కండీషన్ల మధ్య కార్మికులు డ్యూటీ చేయాలి. ఇంతచేసినా.. అధికారులు కార్మికులపై నిత్యం హుకుం జారీ చేస్తూనే ఉంటారు. ఏ చిన్న సమస్య వచ్చినా.. తొలి ముద్దాయి డ్రైవరో, కండక్టరో. పద్మవ్యూహంలా మారిన ట్రాఫిక్ లో.. ఎవరు ఏ వైపు నుంచి వస్తున్నారో… ఎవరు ఎక్కడ దిగుతారో, ఎక్కుతారో తెలియని పరిస్థితి నేడు హైదరాబాద్ పరిధిలో ఉంది. ఎవరైనా బస్సు ఎక్కే సమయంలో కిందపడిపోయినా, వారే తప్పు రూట్లో వచ్చి ఆర్టీసీ బస్సుని గుద్దినా… అధికారుల దృష్టిలో దోషి కార్మికుడే. దాని ఫలితంగా సస్పెన్షన్లు, ఇంక్రిమెంట్ కటింగ్ లు, డ్యూటీ కేటాయించక పోవడం, టైం చార్ట్ వేయకపోవడం.

ఇక ఇటీవల ప్రజల్లో అవగాహన పెరిగింది. ప్రతి విషయానికి ఫోన్ చేసి ఫిర్యాదులు చేయడం ఎక్కువైంది. కానీ ఆర్టీసీ కార్మికులకు ఇదే శాపమైంది. ప్రతి బస్ స్టాప్ లో బస్సుని ఆపడం కొన్ని సార్లు కదరదు. ఆపినా ఓ 30 సెకండ్లు ఆపి ముందుకు కదులుతారు. వెనకాల వచ్చే వ్యక్తి టైంకి బస్సు అందుకోక… ఎక్కే వాడికోసం బస్సు ఆపడం లేదంటు డిపో మేనేజర్ కి ఫిర్యాదు చేశాడనుకో… బలయ్యేది కార్మికుడే. ఇలాంటి సమయంలో… డిపో మేనేజర్లు ఫిర్యాదు చేసిన వ్యక్తి, బస్సు డ్రైవర్, కండక్టర్ లని పిలిచి.. రెండు వైపులా వివరణ తీసుకొని తగిన నిర్ణయం తీసుకోవాలన్న కనీసం పద్ధతి పాటించరు. ఎవరో ముక్కు మొఖం తెలియని వ్యక్తి ఫోన్ చేసి ఫిర్యాదు చేసినంత మాత్రాన… డ్రైవర్, కండక్టర్లను సస్పెండ్ చేయడం, ఇంక్రిమెంట్లు కట్ చేయడం ఎంతవరకు సమంజసం. ఇలాంటి చిన్నవిషయాలకే అధికారుల చర్యలు ఈ స్థాయిలో కఠినంగా ఉంటే… ఇక బస్సు ప్రమాదాలు, పొరపాటున ప్రయాణికులు దిగుతు, ఎక్కుతు పడిపోయి మరణిస్తే.. ఆ బస్సు నడిపిన
డ్రైవర్ కి ఏ స్థాయి శిక్ష వేస్తారో అర్థం చేసుకోవచ్చు.

అందుకే కార్మికులు యూనియన్లకు జై కొడతారు.. !

అధికారులు – కార్మికుల మధ్య ఇలాంటి భిన్న పరిస్థితుల వల్లే… కార్మికులు తమకు న్యాయం చేసేది కేవలం యూనియన్ నాయకులే అని భావిస్తారు. ఆర్టీసీ పై అధికారుల అడ్డగోలు నిర్ణయాలను ప్రశ్నించి.. కార్మికులకు న్యాయం జరిగే వరకు యూనియన్ నాయకులు వదిలిపెట్టరు. ప్రమాదాలు, ఫిర్యాదులపై రెండు వైపుల నుంచి పూర్తి వివరాలు సేకరించి, విచారించిన తర్వాతే చర్యలు తీసుకోండి.. అంతేకానీ ఇష్టారాజ్యంగా కార్మికులని బలి చేస్తామంటే ఊరికునేది లేదని యూనియన్లు కార్మికులకు అండగా నిలుస్తాయి. అలాగే కార్మికులకు న్యాయం బద్ధంగా అందాల్సిన లోన్లు, బకాయిలు, ట్రావెల్ అలవెన్సులు, వైద్య సేవలు, సెలవులు తదితర హక్కలను వారికి అందేలా చేయడంలో యూనియన్లు పెద్దన్న పాత్ర పోషిస్తాయి. అందుకే… ఆర్టీసీ కార్మికులు విధి నిర్వహణలో ఏ సమస్య వచ్చినా.. ముందు యూనియన్లనే సంప్రదిస్తారు. అధికారులు ఉన్నారు కదా అనే ప్రశ్న మీ నుంచి రావచ్చు. కానీ ఇక్కడ అధికారులు కార్మికులను కేవలం బస్సులు నడిపే, నిర్వహించే యంత్రాలుగా మాత్రమే చూస్తారు. వారి సమస్యలు ఆ చెవులకు అనవసరం. నిజంగా అధికారులే కార్మికులతో స్నేహపూర్వకంగా ఉంటే… వారికి యూనియన్ నేతలను ఆశ్రయించాల్సిన అవసరం ఏంటి ? డ్రైవర్, కండక్టర్లు విధి నిర్వహణలో ఎలాంటి అవినీతికి పాల్పడే ఆస్కరమే లేదు. టిం మెషీన్లు వచ్చాక టికెట్ల జారీలో అంతా పారదర్శకమే. సో… కార్మికుల వైపు నుంచి అంతా క్లీన్ గా ఉన్నా.. వారు అధికారులను కాకుండా యూనియన్ నాయకులనే ఎక్కువగా నమ్ముతున్నారంటే.. ఆ తప్పు అధికారులదే అని గట్టిగా చెప్పొచ్చు.

భవిష్యత్ పై భయంతోనే చేరడం లేదా… !!

ఈ పరిస్థితుల నడుమ సీఎం కేసీఆర్ ఇచ్చిన డెడ్ లైన్ లోపు యూనియన్ నాయకులని కాదని డ్యూటీ లో చేరితే… ఆర్టీసీ కార్మికులకు మున్ముందు అండగా నిలిచేది ఎవరు. ఇప్పుడు పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది కాబట్టి… చేరిన వారికి సకల సౌకర్యాలు ఉంటాయన్న హామీలు అయితే దక్కుతాయి. కానీ ఇంటి అల్లుడు ఎప్పుడు కొత్త కాదుగా. పాతపడ్డాగా పచ్చడి మెతుకులైనా నోర్మూసుకుని తినాల్సిందే. అప్పుడు లబోదిబోమన్నా… యూనియన్ నాయకులు డ్యూటీలో చేరిన కార్మికులకు అండగా నిలుస్తారా లేదో ? యూనియన్లు, మెజారిటీ కార్మికుల నిర్ణయాన్ని కాదని చేరితే… రేపటి నాడు పైన చెప్పిన సమస్యల్లో ఏవైనా ఎదురయతే… అండగా నిలిచేది ఎవరన్న సందేహాం చాలా మంది ఆర్టీసీ కార్మికులను వెంటాడుతోంది. అసలు యూనియన్లు లేని ఆర్టీసీ అంటేనే కార్మికులు భయపడుతున్నారు. ఎందుకంటే… ఆర్టీసీ కార్మికుడిది దిన దిన గండాల మధ్య సాగే డ్యూటీ. విధి నిర్వహణలో ఎక్కడ ఏమీ జరిగినా… అన్ని వేళ్లు వారి వైపు ఉంటాయి. ఇలాంటి సందర్భాలో వారికి అండగా నిలిచేవారిని వదిలితే… రేపటికి భరోసా లేదన్నది కార్మిక సోదరుల భయం.
మరి ప్రభుత్వం… అధికారులు – కార్మికుల మధ్య ఉన్న దూరాన్ని తగ్గించేందుకు ఏమైనా చర్యలు తీసుకుంటుందా ? యూనియన్లు లేని ఆర్టీసీ అంటే… కార్మికుల హక్కుల రక్షణకు ఏదైనా ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేస్తుందా.. ? అధికారుల ఏకపక్ష నిర్ణయాలకు కార్మికులు బలికాకుండా రక్షించే బాధ్యతలు ఎవరు తీసుకుంటారు ? ఒక మాస్ ట్రాన్స్ పోర్టులో ప్రతి చిన్న సమస్యను ఉన్నతాధికారులు, ముఖ్యమంత్రి స్థాయిలో నివేదించడం ఒక చిన్నపాటి కార్మికుడు వల్ల సాధ్యం అవుతుందా ? ఇలా అనేక సందేహాలు, ఆందోళనలు ఓ వైపు….. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన డెడ్ లైన్ మరోవైపు. వీటి మధ్య ఇప్పుడు ఆర్టీసీ కార్మిక సోదరులు నలిగిపోతున్నారు.

Thirumalesh Goud ch

error: